అసంపూర్ణ న్యాయమేనా?
(ఇన్)కంప్లీట్ జస్టిస్?: ద సుప్రీం కోర్ట్ ఎట్ 75–– క్రిటికల్ రిఫ్లెక్షన్స్
సంపాదకుడు:
జస్టిస్ ఎస్.మురళీధర్
రాజ్యాంగ అవతరణ జరిగిన రెండు రోజులకు, అంటే 1950 జనవరి 28న భారత అత్యున్నత న్యాయస్థానం తన కార్యకలాపాలను ప్రారంభించింది. ఈ 75 ఏళ్లలో ఎనిమిది మంది న్యాయమూర్తుల నుంచి 34 మంది న్యాయమూర్తులకు అది విస్తరించింది. భారతీయ న్యాయవ్యవస్థ పిరమిడ్ పైభాగాన ఉండే సుప్రీం కోర్టును ఢిల్లీలోని ఒక భవన సముదాయంగా పరిగణిస్తే– కోర్టు రూములు, వందలాది మంది కూర్చోగలిగే న్యాయవాదుల భిన్న ఛాంబర్లతో అది కళకళలాడుతుంటుంది. అక్కడ ప్రాక్టీస్ చేస్తున్న న్యాయవాదుల సంఖ్య 22,734. మరో 3,500 మంది ‘అడ్వకేట్స్ ఆన్ రికార్డ్’. స్టెనోగ్రాఫర్స్, రిజిస్ట్రార్స్, డ్రైవర్స్, ప్యూన్స్ లాంటి ఇతర సిబ్బంది 3,770. ఇక 2025 మే 31 నాటికి పెండింగ్ కేసులు 81,735. ప్రజాస్వామ్యానికి మూడో స్తంభంగా పరిగణించే న్యాయవ్యవస్థ ఈ 75 ఏళ్లలో ఎలాంటి ఎత్తుపల్లాలను చూసిందో లోతుగా చర్చించే పుస్తకం ‘(ఇన్)కంప్లీట్ జస్టిస్?’ శీర్షికే ఇది సంపూర్ణ న్యాయం చేకూర్చలేకపోయిందన్న భావన కలిగిస్తుంది. దాన్నే 24 మంది న్యాయనిష్ణాతులు తమ వ్యాసాలు, ఎడిటర్ స్వయంగా చేసిన ఇంటర్వ్యూల రూపంలో అభిప్రాయాలను పంచుకున్నారు.
‘అందరు సుప్రీంకోర్టు న్యాయమూర్తులకు కూడా మా స్థానిక హవల్దార్‌కు ఉన్నంత శక్తి లేదు’ అని 1992 నాటి కుమ్హేర్ ఊచకోత నుంచి బతికి బయటపడ్డ రాజస్థాన్‌కు చెందిన ‘చున్నీ లాల్ జాతవ్’ చెప్పిన మాటల్ని సీనియర్ జర్నలిస్ట్ పి.సాయినాథ్ ఉటంకిస్తారు. గ్రామాల్లోని అంచుల్లో ఉండేవాళ్లకు కోర్టుల్లోని న్యాయం ఎంత దూరమో ఆయన వివరిస్తారు. రాజ్యాంగానికి ‘ఫౌండింగ్ డాటర్’నని చెప్పుకొనే న్యాయవాది ఇందిరా జైసింగ్... సుప్రీంకోర్టులో, మొత్తంగా న్యాయస్థానాల్లో ఉండే లింగ వివక్షను, లైంగిక హింసను ఎత్తిచూపుతారు. కార్మిక చట్టాల కేసులతో పాటు, ప్రత్యేకంగా పురుష న్యాయమూర్తుల బాధితులుగా ఉన్న మహిళా న్యాయమూర్తుల కేసుల్ని వాదించిన జైసింగ్ ‘అది న్యాయవ్యవస్థ డర్టీ సీక్రెట్’ అంటారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న న్యాయమూర్తిని మరో కోర్టుకు బదిలీ చేయడం అర్థరహిత చర్య, అది ఇంకో కోర్టుకు చేస్తున్న అన్యాయం అంటారు సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి మదన్ లోకూర్. కొలీజియం పేరిట న్యాయమూర్తుల ఎంపికలో కార్యనిర్వాహక వ్యవస్థను మొత్తంగా పక్కనపెడితే, దాని ఆధిక్యాన్ని చాటుకోవడానికి కార్యనిర్వాహక వ్యవస్థ పలు దారులు వెతుకుతుందంటారు లా కమిషన్ మాజీ చైర్మన్ అజిత్ ప్రకాశ్ షా.
ఇన్ని లోపాలు ఉన్నప్పటికీ, సగటున అరవై ఏళ్ల వయసుండే ఒక సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఒక్కోసారి రోజుకు 60–65 హియరింగ్స్‌తో వ్యవహరించాల్సి ఉంటుంది. అంటే వాటన్నింటికి సంబంధించిన పత్రాలను ముందుగా చదివుండటం తప్ప మార్గం లేదు. ‘ప్రపంచంలో ఏ సుప్రీం కోర్టు జడ్జికి కూడా ఇంతటి పని ఒత్తిడి ఉండదు’ అంటారు సీనియర్ అడ్వకేట్ శ్రీరామ్ పంచు. వర్చువల్ హియరింగ్స్‌కు ఆన్లైన్ ఫైలింగ్స్‌ను కూడా తప్పనిసరి చేయగలిగితే సుప్రీంకోర్టు సమర్థత పెరుగుతుందనీ, కోర్టు ప్రాంగణంలో మనుషుల తొక్కిడి ఉండదనీ సలహా ఇస్తారు సీనియర్ అడ్వకేట్ మీనాక్షి అరోరా. 2023 జూలై 30 నాటికి 4,40,47,503 పెండింగ్ కేసులున్న జిల్లా కోర్టుల్లో 20 శాతం పోస్టులు ఖాళీగా ఉండటాన్నీ, కొన్నిచోట్ల కనీసం సరైన ప్రింటర్ కూడా ఉండని వైనాన్నీ వివరిస్తారు సుప్రీం కోర్టు మాజీ న్యాయమూర్తి ఎస్.రవీంద్ర భట్. ఇంకా రాజు రామచంద్రన్(జడ్జీల తొలగింపు), ఉపేంద్ర బక్షి(పిల్స్), కె.చంద్రు(కార్మిక చట్టాలు), ఫైజాన్ ముస్తాఫా(ఆర్టికల్ 30) లాంటివాళ్లు భిన్న అంశాలను స్పృశిస్తారు. ఎన్నో తీర్పుల ఉటంకింపులతో సాగే ఈ వ్యాసాల్ని చదవడం సామాన్య పాఠకులకు కొంత ఇబ్బందే అయినా స్పిరిట్ అర్థం కాకుండా పోదు.
(13-10-2025)