Saturday, May 30, 2026

బూఢీ కాకి

 


ప్రేమ్‌చంద్‌


ప్రేమ్‌చంద్‌ కథ ‘బూఢీ కాకి’ సంక్షిప్త రూపం ఇది. 1920లో ప్రచురితమైంది. ఇరవయ్యో శతాబ్దపు అత్యుత్తమ హిందీ రచయితల్లో అగ్రగణ్యులు ప్రేమ్‌చంద్‌(1880–1936). నవలా చక్రవర్తి అంటారు. గోదాన్, సేవాసదన్, రంగభూమి, కర్మభూమి లాంటి నవలలూ సుమారు 250 కథలూ రాశారు.


ఆకలి శాపం


ముసలితనం అంటే బాల్యం మళ్లీ తిరిగిరావడమే. నాలుక తప్ప మిగిలిన అన్ని జ్ఞానేంద్రియాల శక్తి కోల్పోయింది చిన్నమ్మ. తనవైపు దృష్టి మరల్చుకోవాలంటే ఏడవటం తప్ప ఆమెకు ఇంకో దారి తెలియదు. ఆమె కాళ్లు, చేతులు, కళ్లు అన్నీ ఉడిగిపోయినై. ఇంట్లోవాళ్లు ఆమెకు వేళకు భోజనం పెట్టకపోయినా, చాలినంత పెట్టకపోయినా ఇల్లు అదిరేలా ఏడుస్తుంది.

ఆమె భర్త పోయి చాలా కాలమైంది. ఆమె కొడుకు కూడా తరుణప్రాయంలోనే చనిపోయాడు. చెల్లెలి కొడుకు పండిత్‌ బుద్ధిరామ్‌ తప్ప ఆమెకు ఎవరూ లేరు. అతడి దగ్గరే ఉంటోంది. ఆమెకున్న ఆస్తినంతా అతడి పేర రాసింది. రాసేముందు అతడు పెద్ద వాగ్దానాలే చేశాడుగానీ అన్నీ కల్లలైపోయాయి. ఆమె ఆస్తి వల్ల ఏడాదికి రెండు వందల రూపాయలకు తక్కువ ఆదాయం రాదు. అయినా ఆమెకు కడుపునిండా తిండే పెట్టరు. దీనికి బుద్ధిరామ్‌ను నిందించాలా, ఆయన భార్య రూపనా అన్నది అర్థం కాదు. బుద్ధిరామ్‌ నిజానికి బుద్ధిమంతుడే, డబ్బులను ఖర్చు పెట్టాల్సిన అవసరం రానంతవరకు. రూపకు ముక్కుమీదే కోపం. కానీ దైవభీతి పరురాలు.

మొత్తం కుటుంబంలో చిన్నమ్మకు ఎవరిమీదైనా ప్రేమ ఉందంటే అది లాడ్లీ. బుద్ధిరామ్‌ ముగ్గురు పిల్లల్లోకీ చిన్నది. మొదటి ఇద్దరు మగవాళ్లు. తల్లిదండ్రులను బట్టే పిల్లల ప్రవర్తన ఉన్నట్టు ఈ ఇద్దరూ ముసలామెను ప్రతిదానికీ ఏడిపిస్తారు. ఒకడు గిచ్చి పరుగెడతాడు, ఇంకొకడు నీళ్లు జల్లుతాడు. ఇంట్లో ఏదైనా మిఠాయి చేసినప్పుడు అన్నలు గుంజుకుంటారని తన భాగాన్ని అమ్మమ్మ గదిలోకి వెళ్లి తింటుంది లాడ్లీ, తినుబండారాలు అంటే పడిచచ్చే అమ్మమ్మ తన మిఠాయిలో వాటా కోరుతుందని తెలిసీ. కానీ రౌడీ అన్నలు లాక్కునేదానితో పోలిస్తే అమ్మమ్మకు పోయేది తక్కువే కాబట్టి ఏం ఫరవాలేదు.


2

రాత్రి వేళ. బుద్ధిరామ్‌ ఇంట్లో షెహనాయ్‌ వినిపిస్తోంది. ఊళ్లోని పిల్లలు కళ్లు పెద్దవి చేసుకుని దాన్ని ఆనందిస్తున్నారు. అతిథులకు క్షురకుడు మర్దన చేస్తున్నాడు. ఒక కవిగాయకుడు కవిత్వాన్ని వినిపిస్తుంటే, అతిథులు ‘వహ్వా’ ‘వహ్వా’ అంటున్నారు. ఇంగ్లీషు చదువుకున్న యువకులు ఈ మూర్ఖులతో కలవడం తమ స్థాయికి తగదని దూరంగా నిలుచున్నారు.

ఈరోజు బుద్ధిరామ్‌ పెద్దకుమారుడు సుఖ్‌రామ్‌కు వరపూజ జరుగుతోంది.రూప విందు పనుల్లో హడావుడిగా ఉంది. మట్టిపొయ్యిల మీద పెద్ద మూకుళ్లు పెట్టారు. ఒకదాన్లో పూరీ, కచోరీ, ఇంకోదాన్లో రుచికరమైన కూరలు తయారవుతున్నాయి. నెయ్యి వాసన గాలితో వ్యాపిస్తోంది.

తన గదిలో ఉన్న చిన్నమ్మకు ఈ వాసన సోకి ప్రాణం పోతోంది. నాకు కచ్చితంగా ఈ పూరీలు తేరు, అందరూ తినేసివుంటారు, నాకేమీ ఉంచరు అని తలుచుకుని ఆమె నీరయింది. ఏడుపొచ్చినా ఇంటికి అశుభమని దిగమింగుకుంది.

అబ్బా, ఏం ఘుమఘుమ! నా గురించి ఎవరికి పట్టింది? ఎండిపోయిన రొట్టెలు పెట్టడానికే వాళ్లకు చేతులు రావు, ఈ తీపి పూరీలు నాకు వడ్డిస్తారా? లాడ్లీ ఇవ్వాళ ఇటువైపు రాలేదు. ఇద్దరు మగవాళ్లు మామూలుగానే రారు. అసలు ఇంకా ఏమేం వండుతున్నారో తెలిస్తే బాగుండు.

పూరీలను తలుచుకోగానే చిన్నమ్మ నోట్లో నీళ్లూరినై. ఆమె ఊహలకు రెక్కలు వచ్చినై. బంగారు రంగులో కాలి, మృదువుగా తుంచుకోగలిగే పూరీలు ఆమె కళ్ల ముందు నర్తించినై. చిన్నమ్మకు వెళ్లి మూకుడు ముందు కూర్చోబుద్ధయింది. చేతులు నేలకు ఆన్చి, పాక్కుంటూ గడపదాటి బయటకు వచ్చి, మూకుడు ముందుకు చేరింది.

రూప ఆ సమయంలో ఆత్రంగా ఒక గది నుంచి ఇంకో గదికీ, మూకుళ్ల దగ్గరికీ, భోజనసామగ్రి పెట్టినచోటుకీ  తిరుగుతోంది. ఎవరో వస్తారు, బుద్ధిరామ్‌ సాబ్‌ లస్సీ తెమ్మంటున్నాడని చెబుతారు. మరెవరో వస్తారు, ఇంకేదో ఇమ్మంటారు. ఈలోపు ఒకరు వచ్చి, ఇంకా భోజనాలకు ఎంత సమయం పడుతుందని అడుగుతారు. ఎవరి మీదా అరవడానికి లేదు. అరిచామా ఈ మాత్రం పనులు వెళ్లదీసుకోలేక పోయిందని బంధువులు దెప్పుతారు. దాహంతో ఆమె గొంతు తడారిపోతోంది. మూకుళ్ల వేడి ఒంటిని మాడుస్తోంది. గుక్కెడు నీళ్లు తాగడానికిగానీ విసనకర్రతో ఊపుకోవడానికిగానీ ఆమెకు తీరుబడి లేదు. ఆ సమయంలో ముసలామె మూకుడు ముందు కూర్చోవడం రూప కంటబడింది. ఆమె కోపం నాషాళానికి ఎక్కింది. ‘అప్పుడే నీ కడుపు కాలిపోతోందా? అది కడుపా, కయ్యా? కదలకుండా నీ గదిలో కూర్చోలేవా? ఇంకా చుట్టాలకే పెట్టలేదు, దేవుడికి పెట్టలేదు, ఈమె తయారయ్యింది. నీ నాలుక పడిపోను. ఒకరోజు తిండి పెట్టలేదంటే వేరేవాళ్ల ఇండ్ల మీద పడుతుంది. అందరూ ఈమెకు భోజనం పెట్టక మాడుస్తున్నామని అనుకుంటారు. ప్రాణమైనా పోదు, పాతకి!’

ముసలామె ఏమీ మాట్లాడలేదు. మౌనంగా పాక్కుంటూ వెనక్కి తన గదిలోకి పోయింది.


3

భోజనాలు సిద్ధమైనాయి. విస్తళ్లు వేశారు. వడ్డనలు జరుగుతున్నాయి. పనివాళ్లు కూడా భోజనానికి వచ్చారు. కాకపోతే బంతితో కాకుండా దూరంగా కూర్చున్నారు. అందరి తినడమూ పూర్తయ్యేదాకా ఎవరూ బంతిలోంచి లేవకుండా ఉండటం మర్యాద. పనివాళ్లు తినడానికి ఎక్కువసేపు తీసుకుంటున్నారని ఒకరిద్దరు చదువుకున్న అతిథులు విసుక్కుంటున్నారు. ఇట్లా ఎంగిలి చేత్తో ఊరికే కూర్చోవడంలో అర్థం లేదని వాళ్ల ఉద్దేశం.

తను చేసిన పనికి ముసలామె సిగ్గుపడింది. రూపమీద ఆమెకు కోపం రాలేదు. కోడలు నిజమే మాట్లాడింది– అతిథులు తినకుండా ఇంట్లోవాళ్లు ఎలా భోంచేస్తారు? ఎవరైనా పిలిచేదాకా ఈ గదిలోంచి బయటకు వెళ్లకూడదనుకుంది. కానీ గాలిలో కలిసి వస్తున్న నెయ్యి వాసన ఆమె ఓపికను పరీక్షిస్తోంది. ఒక్కో క్షణం ఒక యుగంలా గడుస్తోంది. నోట్లో ఏదో పాడుకోవడానికి ప్రయత్నించింది. ఇంతసేపు తింటున్నారా అతిథులు? ఆమెకు ఏ శబ్దమూ వినపడలేదు. అందరూ తినేసి వెళ్లిపోయివుంటారు. నన్ను పిలవడానికి ఎవరూ రాలేదు. రూప కోపంతో ఉంది, ఆమె పిలవకపోవచ్చు. నేనే వస్తానని ఆమె అనుకుంటూండవచ్చు. నేనేమైనా బంధువునా ఆమె వచ్చి పిలుచుకుపోవడానికి. తనే వెళ్లడానికి సిద్ధపడింది వృద్ధురాలు. పూరీలు, కచోరీల తలంపు ఆమెను చక్కలిగింతలు పెట్టింది. చాలారోజుల తర్వాత ఇంట్లో పూరీలు చేశారు. కడుపారా తినేయాలని నిశ్చయించుకుంది. జిహ్వ చాపల్యమని ఎవరు అనుకున్నా సరే లెక్క చేయకూడదనుకుంది.

నెమ్మదిగా చేతులు నేల మీద ఆన్చి, పాక్కుంటూ అరుగు మీదికి వెళ్లింది. కానీ అదృష్టం బాగాలేదు. ఆమె ఓపికలేని మనసు వేసిన లెక్క తప్పింది. అతిథులు ఇంకా తింటున్నారు. అప్పుడే తిన్నవాళ్లు వేళ్లు నాక్కుంటున్నారు. మిగిలిపోయిన పూరీలు ఎలా తీసుకెళ్లాలా అని కొందరు ఆలోచిస్తున్నారు. పెరుగు కానిచ్చి, మారు అడగటానికి మొహమాటపడుతున్నవాళ్లు కొందరు. సరిగ్గా ఈ సమయంలో వాళ్ల మధ్యకు వెళ్లింది. కొందరు ఉలిక్కిపడ్డారు. ఈ ముసల్ది ఎక్కడినుంచి ఊడిపడిందని కొందరు ఆశ్చర్యపోయారు. ఏమీ తాకకుండా చూడండని కొందరు అరిచారు.

చిన్నమ్మను చూడగానే పండిత్‌ బుద్ధిరామ్‌కు మండిపోయింది. ఆమె అప్పటికే పూరీల పళ్లెం పట్టుకుంది. దాన్ని నేల మీదికి విసిరికొట్టాడు. అప్పు చెల్లించకుండా పారిపోతున్నవాణ్ని కఠినమైన వడ్డీ వ్యాపారి ఎలా పట్టుకుంటాడో అలా ఆమెను గదిలోకి లాక్కెళ్లాడు. వృద్ధురాలి కల క్షణంలో కరిగిపోయింది.

అతిథులు తినడం పూర్తయింది. ఇంట్లోవాళ్లందరూ తిన్నారు. వాద్యకారులు, పనివాళ్లు కూడా తినడం అయింది. కానీ ముసలామెను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ఆమె చేసిన సిగ్గుమాలినపనికి ఈమాత్రం శిక్ష పడవలసిందే అనుకున్నారు బుద్ధిరామ్, రూప. ఎవరూ ఆమె వయసు మీద దయచూపలేదు. ఆమె నిస్సహాయతను పరిగణనలోకి తీసుకోలేదు. లాడ్లీకి తప్ప ఎవరికీ ఆమె మీద ప్రాణం కొట్టుకోలేదు.

తల్లి, తండ్రి ఇద్దరూ నాన్నమ్మను అలా అనడం ఆ చిట్టితల్లికి ఏడుపు తెప్పించింది. ఆమెకు చేతినిండా పూరీలు ఇస్తే ఏం పోతుంది? అతిథులకన్నా ఆమె ముందు తింటే ఆకాశం భూమ్మీద కూలిపోతుందా? గదిలోకి పోయి ఓదార్చుదామనుకుందిగానీ వాళ్లమ్మకు భయపడి ఊరుకుంది. తనకు వడ్డించిన పూరీల్ని తన బొమ్మపెట్టెలో దాచుకుంది.


4

రాత్రి పదకొండయ్యింది. రూప అరుగు మీద పడుకుంది. పూరీలు తింటున్నప్పుడు నానమ్మ కళ్లల్లో కనబడే సంతోషాన్ని తలుచుకుని లాడ్లీకి నిద్ర పట్టలేదు. అమ్మ నిద్రపోగానే నానమ్మ దగ్గరకు పోవాలనుకుంది. కానీ బయట చీకటిగా ఉంది. మట్టిపొయ్యిల్లోని నిప్పులు మాత్రమే వెలుగుతున్నాయి. అక్కడో కుక్క కూర్చునివుంది. తలుపు వెనకాల నిమ్మచెట్టు మీద లాడ్లీ చూపు పడింది. దానిమీద హనుమంతుడు కూర్చున్నట్టుగా అనిపించింది. తోక, గద స్పష్టంగా కనబడుతున్నాయి. భయంతో కళ్లు మూసుకుంది. అప్పుడే కుక్క లేచి నిలబడింది. అది లాడ్లీకి ధైర్యాన్నిచ్చింది. పడుకునివున్న మనుషులకన్నా నిద్రలేచిన కుక్కే ఆమెకు ఎక్కువ ధైర్యాన్నిచ్చింది. తన బొమ్మపెట్టెను తీసుకుని నానమ్మ గదిలోకి వెళ్లింది.


5

కొండమీదకు ఎవరో లాక్కుపోతున్నట్టుగా కల కంటున్న వృద్ధురాలు ఉన్నట్టుండి మేల్కొంది. అతిథులంతా వెళ్లిపోయుంటారు. దేవుడా, తిండి లేకుండా ఈ రాత్రి ఎలా గడపడం? నాకు పూరీలు ఇస్తే వాళ్ల సంపదేమైనా తరిగిపోతుందా? ‘నాన్నమ్మ, లే’ అంటున్న లాడ్లీ గొంతు విని హుషారుగా లేచి కూర్చుంది. లాడ్లీని ఒళ్లో కూర్చోబెట్టుకుంది. లాడ్లీ పూరీలు చేతికిచ్చింది. ‘మీ అమ్మ ఇచ్చిందా?’ ‘కాదు, ఇవి నా వాటా’. ఐదు నిమిషాల్లో పూరీలు తినేసింది. కొద్దిపాటి వాన భూమ్మీది తాపాన్ని తగ్గించకపోగా వృద్ధి చేసినట్టు ఆ పూరీలు ముసలామె ఆకలిని మరింత పెంచాయి. ఇంకొన్ని తెమ్మని పాపను అడిగింది. అమ్మ కొడుతుందని భయపడింది చిన్నది.  మిగిలిపోయిన తునకలు కూడా తిని, వేళ్లు నాక్కుంది ముసలామె. ఆకలి మరింత ఉధృతమైంది. విచక్షణ కోల్పోయేట్టు చేసింది. అతిథులు తిన్నచోటుకు పట్టుకెళ్లమని పాపను కోరింది.

దేవుడా! అతిథుల ఎంగిలి విస్తళ్లలో మిగిలిపోయిన పూరీ ముక్కలను తీసుకుని తినసాగింది ఆ దీన హీన వృద్ధురాలు! వృద్ధాప్యం, శాపం.

కళ్లు తెరిచిన రూపకు లాడ్లీ కనబడలేదు. ఆందోళనతో లేవగానే కనబడిన దృశ్యం ఆమెను స్తంభింపజేసింది. తన గొంతు కోస్తున్నప్పుడు ఆవు అనుభవించే లాంటి క్షోభను ఆమె అనుభూతించింది. ఎంగిలి విస్తళ్లలో చేయిపెట్టే ఖర్మానికి ఈ వృద్ధురాలిని తీసుకొచ్చానే! అయ్యో, ఈ ప్రపంచానికి ఏ విపత్తు రానున్నది? దయ, భయం ఆమె కళ్లల్లోంచి నీళ్లుగా జారినై. ఈ అధర్మానికి బాధ్యులెవరు? దేవుడా, నా బిడ్డల మీద దయ చూపించు. నేను చేసిన పాపానికి నన్ను శిక్షించకు. అయ్యో అయ్యో, ఇవ్వాళే నా పెద్దబిడ్డకు శుభకార్యం జరిగింది. వందల మంది భోంచేసి వెళ్లారు. ఎవరి ఆస్తినైతే మేము అనుభవిస్తున్నామో, ఆమెనే బిచ్చగత్తెను చేశామే! 

రూప దీపం వెలిగించింది. పళ్లెంలో పూరీలు నిండుగా పెట్టుకుంది. వృద్ధురాలి ముందు నిలబడి గద్గద స్వరంతో క్షమించమని ప్రార్థించింది.


(సాక్షి సాహిత్యం; 2018 జూలై 9)


Wednesday, May 27, 2026

ద బెట్‌


ఆంటన్‌ చెహోవ్‌


ఆంటన్‌ చెహోవ్‌ (1860–1904) రష్యన్‌ కథ ‘ద బెట్‌’ సంక్షిప్త రూపం ఇది. ప్రపంచంలోని గొప్ప కథకుల్లో చెహోవ్‌ ఒకరు.


అబద్ధం నిజం


పదిహేనేళ్ల క్రితం తాను ఇచ్చిన ఒక విందు గురించి ఆలోచిస్తున్నాడు ముసలి బ్యాంకర్‌. ఆ విందులో ఆసక్తికరమైన సంభాషణ సాగింది. అంశం మరణశిక్ష మీదకు మళ్లింది. అతిథుల్లోని చాలామంది పండితులు, పాత్రికేయులు మరణశిక్షను నీతిబాహ్యమైనదిగా నిరసించారు. దానికి బదులుగా యావజ్జీవ కారాగారశిక్షను అమలు చేయాలన్నారు.

‘నేను మీతో ఏకీభవించను,’ అన్నాడు బ్యాంకర్‌. ‘నేను మరణశిక్షనుగానీ యావజ్జీవాన్నిగానీ అనుభవించనప్పటికీ, నా ఉద్దేశంలో మరణదండనే నీతివంతమైనదీ మానవీయమైనదీ కూడా. అది ఒకేసారి చంపేస్తుంది, యావజ్జీవం దశలవారీగా ప్రాణం తీస్తుంది. ఏది మానవీయం?’

‘రెండూ సమానంగా నీతిబాహ్యమైనవే’ అన్నాడు ఒక అతిథి. ‘వాటి లక్ష్యం ఒకటే, ప్రాణాన్ని తీయడం. ప్రభుత్వమేమీ దేవుడు కాదు, అది ఇవ్వలేని జీవితాన్ని తీసుకునే హక్కు దానికి లేదు’.

అతిథుల్లో ఒక పాతికేళ్ల న్యాయవాది కూడా ఉన్నాడు. అతడి స్పందన ఏమిటా అని అడిగినప్పుడు, ‘రెండూ కూడా సమానంగా అధర్మమైనవే. కానీ అవకాశం ఉంటే గనుక నేను యావజ్జీవాన్నే ఎంచుకుంటాను. చనిపోవడం కన్నా ఏదో విధంగా బతికివుండటం నయం కదా’ అన్నాడు.

బ్యాంకర్‌కు అసహనం పెరిగింది. టేబుల్‌ మీద గుద్దుతూ, ‘అది అబద్ధం. ఐదేళ్లు కూడా నువ్వు జైల్లో ఉండలేవని ఇరవై లక్షల పందెం’ అన్నాడు.

‘మీరు సీరియస్‌గానే అంటున్నారంటే, ఐదు కాదు పదిహేనేళ్లుంటాను’ బదులిచ్చాడు లాయర్‌.

‘పదిహేనా! సరే!’ అరిచాడు బ్యాంకర్‌. ‘నా పందెం ఇరవై లక్షలు’.

‘ఒప్పుకుంటున్నా. మీ పందెం ఇరవై లక్షలు, నా పందెం నా స్వతంత్రం’.

అట్లా ఈ అర్థం లేని పందెం అమలులోకొచ్చింది. భోజనం సమయంలో న్యాయవాదితో, ‘ఇప్పటికైనా తెలివి తెచ్చుకో, నాకు ఇరవై లక్షలతో పోయిందేమీ లేదు, నువ్వు అనవసరంగా నీ జీవితంలోని విలువైన నాలుగైదేళ్లను కోల్పోతావు’ అని హెచ్చరించాడు. ‘మూడు నాలుగు అని ఎందుకంటున్నానంటే నువ్వు అంతకంటే ఎక్కువకాలం ఉండలేవు. తప్పనిసరైతే సరే, కానీ ఐచ్ఛిక శిక్షను భరించలేవు. ఎప్పుడంటే అప్పుడే స్వేచ్ఛను పొందగలనన్న స్పృహ నీ ఖైదుకాలాన్ని విషతుల్యం చేస్తుంది’.

అప్పటి పందెం గురించి బ్యాంకర్‌ తలపోస్తూ ఇంట్లో పచార్లు చేస్తున్నాడు. ‘ఆ పందెం నేను ఎందుకు కాసినట్టు? దానివల్ల జరిగే మేలేమిటి? ఆ లాయర్‌ తన జీవితంలో పదిహేనేళ్లు కోల్పోతాడు, నేను నా ఇరవై లక్షలు తగలేస్తాను. దీనివల్ల యావజ్జీవం మరణదండనకన్నా మెరుగనో, హీనమనో ఏమైనా తేలుతుందా? డబ్బు కొవ్వున్నవాడి చపలచిత్తం నాదైతే, డబ్బు మీది దురాశ ఆ లాయర్‌ది’.

ఆ విందు తర్వాత న్యాయవాదిని బ్యాంకర్‌ పెరటింటిలో ఖైదు చేయాలని నిశ్చయించారు. అతడు తన ఖైదుకాలంలో గడప దాటి బయటకు రాకూడదు, మనుషులను చూడకూడదు, వారి గొంతు వినకూడదు, ఉత్తరాలు స్వీకరించకూడదు, వార్తాపత్రికలు తెప్పించుకోకూడదు. సంగీత వాద్యం ఉంచుకోవచ్చు, పుస్తకాలు చదవొచ్చు, లేఖలు రాయొచ్చు, మద్యం, పొగ తాగొచ్చు. వీటిల్లో ఏది కావాలన్నా ప్రత్యేకంగా నిర్మించిన గది కిటికీ గుండా చిన్న నోట్‌ పంపొచ్చు. అన్ని సూక్ష్మ వివరాలతో సహా ఒప్పందం రాయబడింది. నవంబర్‌ 14, 1870 పన్నెండు గంటల నుంచి నవంబర్‌ 14, 1885 పన్నెండింటిదాకా సరిగ్గా పదిహేనేళ్లపాటు ఈ ఒప్పందం అమల్లోవుంటుంది. దీన్ని కనీసం రెండు నిమిషాల ముందు ఉల్లంఘించినా బ్యాంకర్‌  ఇరవై లక్షలు చెల్లించనక్కర్లేదు.

అతడు పంపిన చిన్న నోట్సుల ఆధారంగా తెలిసింది ఏమంటే, మొదటి సంవత్సరపు ఖైదులో లాయర్‌ తీవ్రమైన ఒంటరితనానికి లోనయ్యాడు. ఆ గదిలోంచి రాత్రీ పగలని లేకుండా పియానో శబ్దాలు వినబడేవి. అతడు మద్యాన్నీ పొగనూ నిరాకరించాడు. ‘మద్యం కోరికలను రగిలిస్తుంది. ఖైదీకి ముఖ్య శత్రువులు కోరికలు’ అని రాశాడు. గదిలోని వాతావరణాన్ని పాడు చేస్తుందని పొగ కూడా తాగలేదు. మలుపులున్న ప్రేమ, క్రైమ్, ఫాంటసీ, కామెడీ వంటి చౌకబారు పుస్తకాలను తెప్పించుకున్నాడు.

రెండో ఏడాదిలో పియానో శబ్దాలు అసలు వినబడలేదు. క్లాసిక్‌ రచనలు మాత్రమే కోరుకున్నాడు. మళ్లీ ఐదో ఏడాదిలో ఆ గదిలోంచి సంగీతం వినబడింది. మద్యం కూడా కావాలని కోరాడు. ఆ సంవత్సరమంతా అతడు తినడం, తాగడం, తన మంచం మీద పడుకోవడం తప్ప ఇంకేమీ చేయలేదు. తరచూ ఆవలించేవాడు. తనలో తాను కోపంగా మాట్లాడుకునేవాడు. చాలాసేపు ఏదో రాసుకునేవాడు, దాన్ని మళ్లీ తెల్లారి మొత్తం చించేసేవాడు. చాలాసార్లు ఏడ్చేవాడు.

ఆరో సంవత్సర ద్వితీయార్థంలో భాషాశాస్త్రాలు, తత్వశాస్త్రం, చరిత్ర ఉత్సాహంగా చదివాడు. ఎంత ఆబగా చదివాడంటే అతడు కావాల్సిన పుస్తకాలను తెప్పించడానికి బ్యాంకర్‌కు సమయం చాలేది కాదు. నాలుగేళ్ల కాలంలో ఆరువందల ఉద్గ్రంథాలను కొనాల్సివచ్చింది. ఆ తీవ్రోత్సాహంలో ఉన్నప్పుడే లాయర్‌నుంచి బ్యాంకర్‌కు ఓ లేఖ వచ్చింది. ‘నా ప్రియమైన జైలర్, నేను ఈ వాక్యాలను ఆరు భాషల్లో రాస్తున్నాను. వాటిని నిపుణులకు చూపించండి. అందులో గనక ఒక్క తప్పూ లేకపోతే దయచేసి పెరట్లో ఒకసారి తుపాకిని కాల్పించండి. ఆ శబ్దం వల్ల నా ప్రయత్నం విఫలం కాలేదని తెలుస్తుంది. భిన్న దేశాల్లోని భిన్న తరాల మేధావులు  భిన్న భాషల్లో మాట్లాడినప్పటికీ వాళ్లందరిలోనూ వెలిగే జ్యోతి ఒక్కటే. వాళ్లందరినీ అర్థం చేసుకోగలిన నా పరమానందాన్ని ఏమని వర్ణించను!’ అతడి కోరిక నెరవేరింది. బ్యాంకర్‌ ఆదేశం మీద రెండుసార్లు పెరట్లో తుపాకి పేలింది.

పదో ఏడాది తర్వాత లాయర్‌ తన టేబుల్‌ మీద నిశ్చలంగా కూర్చుని న్యూ టెస్టమెంట్‌ చదివాడు. నాలుగేళ్లలో ఆరు వందల పాండిత్య గ్రంథాల్ని చదివినవాడు ఈ సన్నటి, తేలికగా అర్థమయ్యే పుస్తకాన్ని సుమారు ఏడాదికాలం చదవడం బ్యాంకర్‌ను ఆశ్చర్యగొలిపింది. తర్వాత లాయర్‌ మత చరిత్రలు, వేదాంతం కోరుకున్నాడు.

చివరి రెండేళ్లు లెక్కాపత్రం లేకుండా చదివాడు. ప్రకృతి శాస్త్రాలు, బైరన్, షేక్‌స్పియర్, ఒకసారి రసాయన శాస్త్రం కోరేవాడు, మరోసారి వైద్యశాస్త్రం, నవల, తత్వశాస్త్రం మీద సిద్ధాంత గ్రంథం... సముద్ర ప్రయాణంలో ప్రమాదానికి గురైన నౌకలోనివాడు దొరికిన చెక్కనల్లా పట్టుకుని తన ప్రాణాన్ని కాపాడుకోవడానికి ప్రయత్నించినట్టుగా ఒక్కో పుస్తకం చదివాడు.

’ ’ ’

ఇక రేపు పన్నెండు గంటలైతే పందెం పూర్తవుతుంది. ‘నేను అతడికి ఇరవై లక్షలు చెల్లించాల్సి వుంటుంది’ అని గుర్తుచేసుకున్నాడు బ్యాంకర్‌. ‘చెల్లిస్తే గనక నేను దివాళా తీసినట్టే’.

పదిహేనేళ్ల క్రితం బ్యాంకర్‌ దగ్గర లక్షలు మూలిగాయి. కానీ ఇప్పుడు ఆస్తులకంటే అప్పులు అధికం. స్టాకు మార్కెట్లతో ఆడిన జూదం, జాగ్రత్తపడలేనితనం అతన్ని నిండా ముంచాయి. అతడి పూర్వపు ఆత్మవిశ్వాసం పోయింది. ‘శాపం లాంటి పందెం’ అనుకున్నాడు. ‘అతడెందుకు చావలేదు? మహా అయితే అతడికి నలబై ఏళ్లు. నా చివరి రూపాయి కూడా తీసుకుని వెళ్లిపోతాడు, పెళ్లి చేసుకుంటాడు, జూదం ఆడతాడు. నేనేమో బిచ్చగాడిలా దీనంగా నిలబడితే అతడు ‘నేనేమైనా మీకు సాయం చేయగలనా’ అని అడుగుతాడు. ఇది నేను భరించలేను. దీన్ని తప్పించుకోవాలంటే అతడు చావడం ఒకటే మార్గం’.

గడియారం మూడు కొట్టింది. ఇంట్లో అందరూ పడుకున్నారు. నిశ్శబ్దంగా అతడు ఇనప్పెట్టెలోంచి ఆ పదిహేనేళ్ల పాటు తెరవని గది తాళంచెవి తీసుకున్నాడు. పెరడంతా చీకటిగావుంది. వర్షం కురుస్తోంది. వాచ్‌మన్‌ వానకు ఎక్కడో పడుకున్నట్టున్నాడు. పిలిస్తే బదులు రాలేదు. ‘నేను అనుకున్న పని ధైర్యంగా చేయగలిగితే అనుమానం వాచ్‌మన్‌ మీదికి పోతుంది’ అనుకున్నాడు. బందీ ఉన్న గది దగ్గరికి వెళ్లి కిటికీ లోంచి లోపలికి చూశాడు. క్యాండిల్‌ వెలుగుతోంది. బందీ టేబుల్‌ ముందు కూర్చున్నాడు. కిటికీ మీద చిన్నగా తట్టాడు. బందీ కదలలేదు. బ్యాంకర్‌ జాగ్రత్తగా తాళం మీది సీల్‌ చించి, చెవితో తాళం తీశాడు. త్రుప్పు పట్టిన తాళం చప్పుడు చేస్తూ తెరుచుకుంది. లోపలినుంచి ఒక పెద్ద ఆశ్చర్యాన్ని ఊహించాడు. కానీ పదిహేనేళ్ల బందీఖానా లాయర్‌ను కదలకుండా కూర్చోవడం నేర్పింది. బ్యాంకర్‌ లోపలికి పోదామని నిశ్చయించుకున్నాడు.

ఒక అస్థిపంజరంలాంటి శరీరం కూర్చునివుంది. పొడవైన వెంట్రుకలు. అవీ తెల్లబడుతున్నాయి. పసుపు పచ్చటి ముఖం. నలబై ఏళ్లవాడంటే ఎవరూ నమ్మరు. టేబుల్‌ మీద ఏదో రాసిన కాగితం ఉంది. ‘లక్షలు వస్తాయని కలగంటున్నట్టున్నాడు, మంచం మీదకు తోసి దిండుతో అదిమానంటే ఈ సగంప్రాణి పూర్తిగా చస్తుంది’ అనుకున్నాడు బ్యాంకర్‌. ‘ముందైతే ఏం రాశాడో చదువుదాం’.

‘రేపు అర్ధరాత్రి పన్నెండుకు నా స్వతంత్రం నాకు వెనక్కి వస్తుంది. కానీ ఈ గదిని వదిలి, సూర్యుణ్ని చూడటానికి ముందు కొన్ని మాటలు పంచుకోవాలి. నా స్వతంత్రాన్నీ, నా జీవితాన్నీ, నా ఆరోగ్యాన్నీ, మీ పుస్తకాలు ప్రపంచ భాగ్యాలని వర్ణించేవన్నింటినీ నా ఆత్మసాక్షిగా అసహ్యించుకుంటున్నాను. ఎండమావి లాగా ప్రతిదీ శూన్యంగా, మిధ్యగా కనబడుతోంది. అందం, తెలివితేటలు ఎన్నివున్నా మృత్యువు తప్పదు. మేధావుల అమరత్వం కూడా నశించిపోయేదే. మీరు తప్పుదోవలో పయనిస్తున్నారు. అబద్ధాన్ని నిజంగా, వికారాన్ని అందంగా భావిస్తున్నారు. మీరు దేనికోసమైతే జీవిస్తున్నారో దాని పట్ల నాకున్న తిరస్కారాన్ని తెలియజేసేందుకు నేను ఒకప్పుడు స్వర్గసమానంగా భావించిన ఇరవై లక్షలను  వదులుకుంటాను. సరిగ్గా రేపు ఐదు నిమిషాల ముందు గదిలోంచి వెళ్లిపోయి ఒప్పందాన్ని ఉల్లంఘిస్తాను’.

చదవగానే బ్యాంకర్‌ అతడి తలను ముద్దాడి, ఏడుస్తూ తిరిగి ఇంట్లోకి వెళ్లిపోయాడు. జీవితంలో ఏనాడూ తన పట్ల తనకు ఇంత అసహ్యం కలగలేదు. 

తెల్లారి, ఆ మనిషి గది కిటికీ ఎక్కి వచ్చి, గేట్లోంచి అదృశ్యమయ్యాడని పరుగెత్తుతూ వచ్చి చెప్పాడు వాచ్‌మన్‌. బ్యాంకర్‌ ఆ విషయాన్ని ధృవపరుచుకుని, అనవసరమైన పుకార్లు రాకుండా, ఇరవై లక్షలపై తన హక్కును వదులుకుంటున్నట్టుగా లాయర్‌ రాసిన కాగితాన్ని ఇనప్పెట్టెలో భద్రపరిచాడు.

(సాక్షి సాహిత్యం; 2018 మే 21)


Sunday, May 24, 2026

ద షాట్‌


అలెగ్జాండర్‌ పుష్కిన్‌

అలెగ్జాండర్‌ పుష్కిన్‌ 1831లో రాసిన ‘ద షాట్‌’ కథాసారం ఇది. రష్యన్‌ ఆధునిక సాహిత్యానికి పుష్కిన్‌ మార్గదర్శి అంటారు.


ఛాలెంజ్‌


ఈ కథను మనం కథకుడి నోటి నుంచి వింటాం. అతడు సైన్యంలో పనిచేస్తుంటాడు. వాళ్లు ‘ఎన్‌...’ అనే చిన్న పట్టణంలో ఉన్నారప్పుడు. ఆర్మీ అంటే డ్రిల్లు, డిన్నరు, పేక; ఇదే జీవితం. యూనిఫారాలు తప్ప మరొకటి కనబడవు.

సైనికులు తమ బృందంతో కలవనిచ్చే వేరే వ్యక్తి ఒక్కడే. ఆయన వయసు ముప్పై ఐదు ఉండొచ్చు. ఈ కుర్రాళ్ల మధ్య అతడు పెద్దమనిషి కిందే లెక్క. అతడు ఎక్కువ మాట్లాడడు. మాట్లాడినా కోసినట్టుగా ఉంటుంది మాట. చూడ్డానికి రష్యన్‌లా కనబడినా పేరు విదేశీలా ధ్వనిస్తుంది. కుర్రాళ్లందరికీ సిల్వియో అంటే ఒక ఇది ఉంటుంది. అతడు అంతకుముందు అశ్వికదళంలో పనిచేశాడు. మరి ఎందుకు అందులోంచి రిటైర్‌ అయ్యాడో, ఎందుకు ఈ పాడుబడిన ఊళ్లో ఉంటున్నాడో ఎవరికీ తెలీదు. సిల్వియో సైనికుల గుంపుతో కలిసి షాంపేన్‌ తాగుతాడు. వాళ్లు అడిగితే తన దగ్గరున్న పుస్తకాలు ఇస్తాడు. అవి ఎక్కువగా సైన్యం గురించినవే అయివుంటాయి. సిల్వియోకు ఎక్కువ వినోదకరమైంది మాత్రం షూటింగ్‌. బుల్లెట్లు తగిలి అతడి ఇంటి గోడలు తేనెపట్టు రంధ్రాలైనాయి. సిల్వియో గురి ఎంత గొప్పదంటే, నీ టోపీ మీదున్న పండును కొడతానని గనక అతడంటే, దాన్ని నెత్తిన పెట్టుకోవడానికి ఏ ఒక్క సైనికుడు కూడా జంకడు.

సైనికుల సంభాషణ తరచూ ద్వంద్వయుద్ధాల మీదకు మళ్లేది. ఆ రోజుల్లో ఇద్దరు మనుషుల మధ్య తేడా వచ్చిందంటే ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసరడం మామూలే. కానీ వాటిలో సిల్వియో జోక్యం చేసుకునేవాడు కాదు. బదులిచ్చినా పొడిగానే. అయినా సిల్వియో పిరికివాడై ఉంటాడన్న ఆలోచన కూడా ఎవరి తలలోకి దూరేది కాదు. కానీ ఒక సంఘటన కథకుడిని విస్తుపోయేలా చేసింది. 

ఒకరోజు ఓ పదిమంది సిల్వియోతో విందు చేసుకున్నారు. అనంతరం సైనికులు అడిగిన మీదట బలవంతంగా పేక ఆడటానికి ఒప్పుకున్నాడు సిల్వియో. అయితే, స్కోర్‌ దగ్గర చిన్న తేడా జరిగింది. ఎక్కువ మాట్లాడని సిల్వియో దాన్ని చాక్‌పీస్‌తో సరిదిద్దే ప్రయత్నం చేశాడు. దీనిలోనే మాటలు పెరిగాయి. కొత్తగా ఆ రెజిమెంటుకు వచ్చిన కుర్ర లెఫ్ట్‌నెంట్‌ కోపంగా సిల్వియో మీదకు టేబుల్‌ మీదున్న ఇత్తడి దీపపు సెమ్మె విసిరేశాడు. జరిగినదానికి మిగతా సైనికులు భీతిల్లారు. వీడింక చచ్చాడే అనుకున్నారు. అయినా కాసేపు ఆట మౌనంగా కొనసాగింది. సిల్వియోకు ఆసక్తి పోయిందని గ్రహించి ఒక్కొక్కరూ బయటికి నడిచారు.

తెల్లారి గుర్రపు స్వారీల దగ్గర ఆ లెఫ్ట్‌నెంట్‌ ఇంకా బతికేవున్నాడని తెలిసి అందరూ ఆశ్చర్యపోయారు. సిల్వియో ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసరలేదా? ఇది కుర్రాళ్ల దృష్టిలో సిల్వియోను పలుచన చేసింది. మనిషి గుణాలన్నింటిలోకీ శ్రేష్ఠమైందని యువకులు తలిచే ధైర్యం లేకపోవడాన్ని వాళ్లు క్షమించలేరు. అందరికన్నా సిల్వియోతో ఎక్కువ దగ్గరితనం ఉన్న కథకుడు కూడా సిల్వియో కళ్లలోకి చూడటానికి ఇష్టపడలేదు.

ఒకరోజు ఒక ఉత్తరం వచ్చింది. దాన్ని చదవగానే సిల్వియో కళ్లు మెరిశాయి. తను ఇక నిష్క్రమించాల్సిన తరుణం వచ్చిందనీ, వెళ్లేలోగా చివరిసారి రాత్రికి తనతో భోజనం చేయమనీ కుర్రాళ్లను ఆహ్వానించాడు. ప్రత్యేకించి కథకుడికి మరీ మరీ చెప్పాడు. విందు బాగా జరిగింది. అందరూ సిల్వియోకు వీడ్కోలు చెప్పి బయలుదేరారు. కథకుడు కూడా బయలుదేరుతుండగా చేయి పట్టి ఆపాడు సిల్వియో. ఇద్దరూ మౌనంగా కాసేపు పైపులు కాల్చారు. ‘ఇంక మనం మళ్లీ ఎప్పటికీ కలవలేకపోవచ్చు. వెళ్లేముందు నేను నీకో వివరణ ఇవ్వాల్సివుంది’ అన్నాడు సిల్వియో. ‘నా మీద ఉన్న చెడు తలంపును దూరం చేయకపోతే అది నన్ను జీవితకాలం వెంటాడుతుంది’ అని చెప్పి, ఆ రోజు ఆ తాగుబోతు ‘ఆర్‌...’ను వదిలేయడానికి తన ఔదార్యం మాత్రమే కారణం కాదనీ, వాడిని పిస్టల్‌తో కాల్చడంలో తనకో స్పష్టమైన ఆధిక్యత ఉన్నప్పటికీ, ఆయుధాల ఆటలో తన జీవితం కూడా ప్రమాదంలో పడే వీలుందనీ చెప్పాడు సిల్వియో. ఈ వివరణ కథకుడిని మరింత స్తంభించేలా చేసింది. మృత్యువు అంచుకు వెళ్లే హక్కు తనకు లేదంటాడు సిల్వియో. దానిక్కారణం ఆరేళ్లుగా అతడు తీర్చుకోవడానికి ఎదురుచూస్తున్న ఒక ప్రతీకారం. తనను దెబ్బ కొట్టిన శత్రువు ఇంకా బతికేవున్నాడు. ఆ గతానికి గుర్తుగా పెట్టెలోంచి తీసి బుల్లెట్‌ దిగిన ఒక టోపీని చూపించాడు.

సిల్వియో అశ్వికదళంలో పనిచేసే రోజుల్లో అసాధారణ వీరుడిగా పేరొచ్చింది. ద్వంద్వయుద్ధాల్లో అతడికి సాటి లేరు. అలాంటి రోజుల్లో వాళ్ల రెజిమెంటుకు కొత్త ఆఫీసర్‌ వస్తాడు. అతడు ధనవంతుడు, అందగాడు, దేన్నీ లెక్కచేయని ధైర్యవంతుడు, మాటకు మాటను తెలివిగా విసురుతాడు. తనను సవాల్‌ చేసేవాడే లేడనుకున్న తరుణంలో వచ్చిన ఈ కొత్త ఆఫీసర్‌ సిల్వియోలో ఈర్శ్య పుట్టిస్తాడు. చివరికి ఒకరోజు ఒక విందునాట్యంలో అతడిని పరుషమైన మాటంటాడు సిల్వియో. బదులుగా అతడు  సిల్వియో ముఖం మీద కొడతాడు. ఇద్దరూ కత్తులు దూసుకుంటారు. పెద్ద గందరగోళం జరుగుతుంది. ఆ రాత్రే వాళ్లు ద్వంద్వయుద్ధానికి సవాల్‌ విసురుకుంటారు.

తెల్లవారుతుంది. నిర్దేశిత స్థలంలో సిల్వియో అసహనంగా ఎదురుచూస్తుంటాడు. వెంబడి ముగ్గురు సహాయకులుంటారు. కొత్త ఆఫీసర్‌ తాపీగా నడుచుకుంటూ వస్తాడు. తన క్యాపులో చెర్రీపళ్లు ఉంటాయి. వెంట ఒక్కడే సహాయకుడు. సహాయకులు ఇద్దరి మధ్యా పన్నెండు అంగల దూరం కొలుస్తారు. ముందు ఎవరు కాల్చాలి? సిల్వియో చేయి వణుకుతుంది. తనకు తాను ఆ నిశ్చలత ఇచ్చుకోవడానికి వీలుగా ఆఫీసర్‌కు మొదటి షాట్‌ ఆఫర్‌ ఇవ్వబోతాడు సిల్వియో. కానీ సహాయకులు వారించి పాచిక వేస్తారు. ఆఫీసర్‌ చెప్పిన అంకె పడుతుంది. అతడు గురిపెట్టి మొదటి షాట్‌ కాలుస్తాడు. సరిగ్గా సిల్వియో నుదురు పైన అంగుళం దూరం నుంచి క్యాపుగుండా వెళ్తుంది బుల్లెట్‌. 

ఇప్పుడు సిల్వియో వంతు. గురి చూసి కొట్టడంలో మొనగాడైన సిల్వియో చేతుల్లో ఆఫీసర్‌ ప్రాణం ఉంది. సిల్వియో పిస్టల్‌ గురి పెడతాడు. అతడిలో ఏమైనా భయం జాడ ఉన్నదా? ఊహు. తాపీగా టోపీలోంచి విరగబండిన చెర్రీపళ్లను తీసుకు తింటూ, వాటి గింజలు నోట్లోంచి దూరంగా సిల్వియో కాళ్ల దగ్గర వచ్చి పడేలా ఊస్తూ నిలబడతాడు. ఇది సిల్వియోను కలవరపరుస్తుంది. ఎవడైనా భయపడితే వాడి బతుకును లాక్కోవచ్చు. ఇట్లాంటివాడిని చంపితే ఎంత, చంపకపోతే ఎంత?

పిస్టల్‌ దించి, నువ్వింకా చావడానికి సిద్ధంగా లేనట్టున్నావు, నీ బ్రేక్‌ఫాస్ట్‌ కానీ, నేను అడ్డురానంటాడు సిల్వియో. అడ్డు వస్తున్నావని ఎవరన్నారు? కాల్చుకో, షాట్‌ నీది, నేను ఎప్పుడైనా సిద్ధం అంటాడు అతను. సహాయకులతో తన షాట్‌ను ఈ రోజు తీసుకోనని సిల్వియో చెప్పడంతో ఆ ద్వంద్వయుద్ధం ఆగిపోతుంది.

తర్వాత సిల్వియో ఈ ఊరికి వచ్చి, ఇక్కడ స్థిరపడ్డాడు. తన ప్రతీకారం గురించి అతడు ఆలోచించని రోజంటూ లేదు. అనుకోకుండా సిల్వియో ఏజెంట్‌ మాస్కో నుంచి రాసిన ఆ ఉత్తరంలో ‘ఒకానొక వ్యక్తి’ ఒక అందమైన అమ్మాయిని వివాహం చేసుకోబోతున్నాడని రాశాడు. ఈ కథంతా సిల్వియో కథకుడికి చెప్పి, ఆ ఒకానొక వ్యక్తి ఎవరో నీకు అర్థమైందనుకుంటాను, అని అడుగుతాడు. ఆ రోజు మృత్యువు ముఖంలోకి చెర్రీపళ్లు తింటూ చూసినట్టుగానే ఈ వివాహ వేడుక సందర్భంగా కూడా చూస్తాడా? సిల్వియో తన సామగ్రి సిద్ధం చేసుకుని, బోనులోంచి బయటపడిన పులిలా ఇంట్లోంచి బయటకు వెళ్లాడు. అతడి కోసం గుర్రాల బండి సిద్ధంగా ఉంది.

’ ’ ’

చాలా ఏళ్లు గడిచాయి. కుటుంబ పరిస్థితులు మన కథకుడిని ‘ఎమ్‌...’ అనే ఊళ్లో స్థిరపడేలా చేశాయి. ఊళ్లో ప్రత్యేకించి ఏమీ జరగదు. ఒక్క విశేషం ఉంటే దాని గురించి రెండు నెలలు చెప్పుకుంటారు గ్రామస్థులు. కథకుడి ఇంటికి నాలుగు వర్స్‌›్టల దూరం(1 వర్స్‌›్ట= 1.1 కిలోమీటర్‌)లో దొరసాని బి... ఎస్టేట్‌ ఉంది. అది ఎ... అనే గ్రామం కిందికి వస్తుంది. ఎస్టేట్‌లో పర్యవేక్షకుడు తప్ప ఎవరూ ఉండరు. ఆమెకు పెళ్లయిన తొలి ఏడాది ఓసారి ఇక్కడికి వచ్చి వెళ్లిందట. మళ్లీ ఆమె భర్తతో సహా ఎస్టేట్‌కు వస్తున్నారని తెలిసి కథకుడు ఉత్సాహపడతాడు. ఊళ్లల్లో జరగ్గలిగే విశేషాలు అంతకంటే ఏముంటాయి?

జమీందారు, అతడి భార్య వచ్చారని తెలిశాక వచ్చిన మొదటి ఆదివారం కథకుడు తన వందనాలు తెలియజేయడానికి వెళ్లాడు. భవంతి అత్యంత విలాసవంతంగా ఉంది. పుస్తకాలు, కంచు ప్రతిమలు, తివాచీలు, పెద్ద అద్దం... ఒక పనివాడు ఈయన వచ్చినట్టు చెప్పడానికి లోపలికి వెళ్లాడు. ఇంత సంపద ఎప్పుడూ చూసివుండని కథకుడిలో కొంత వణుకు పుట్టిన మాట నిజం. కానీ అందమైన ముప్పై రెండేళ్ల వరకు వయసుండే జమీందారు వచ్చీరావడంతోనే స్నేహంగా పలకరించాడు. ఈ లోపల దొరసాని కూడా వచ్చింది. ఆమె ఇంకా అందగత్తె. కథకుడి బిడియం పోయేలా ఇద్దరూ మామూలుగా మాట్లాడసాగారు. ఆ గదిలో ఉన్న ఒక పెయింటింగ్, అది స్విట్జర్లాండ్‌లోని ఒక దృశ్యం, కథకుడిని ఆకర్షించింది. దానిమీద సరిగ్గా ఒక దానిమీద ఒకటి తగిలిన రెండు బుల్లెట్‌ గుర్తులున్నాయి. ‘మంచి షాట్‌’ అన్నాడు కథకుడు. ‘అవును, అసాధారణమైన షాట్‌’ అని బదులిచ్చాడు జమీందారు. అట్లా మాటల్లో ముప్పై అంగల దూరం నుంచి గురి తప్పకుండా కాల్చగలనని చెప్పాడు కథకుడు. నువ్వు కూడా అలా కాల్చగలవా డియర్, అని అడిగింది దొరసాని. ఏదో ఒక రోజు నేనూ కాల్చగలనన్నాడు జమీందారు. నాకు తెలిసిన ఒకతను ఉండేవాడు, గోడ మీద ఈగ కనబడితే పిస్టల్‌ తెమ్మని కేకేసేవాడు, ఢాం, అదీ అతడి గురి అని చెప్పాడు కథకుడు. ఎవరాయన? అడిగాడు జమీందారు. ‘సిల్వియో అని...’ ‘సిల్వియో!’ అరిచినంత పనిచేశాడు జమీందారు. దీంతో ఆ పాత కథంతా తవ్వుకోవాల్సి వస్తుంది.

జమీందారుకు పెళ్లయి నెలే అయిందప్పుడు. ఆరోజు కొత్త దంపతులు గుర్రపు స్వారీకి వెళ్లారు. దొరసాని గుర్రం ఆ రోజు మాట వినకపోతే ఆమె దిగి నడుచుకుంటూ వస్తానంది. జమీందారు ముందు ఇల్లు చేరాడు. వచ్చేసరికి సిల్వియో ఉన్నాడు. అతణ్ని చూడగానే జమీందారు రోమాలు నిక్కబొడుచుకున్నాయి. బాకీ తీర్చమని అడిగాడు సిల్వియో. జమీందారు సిద్ధమయ్యాడు. భార్య వచ్చేలోగా కాల్చమని కోరాడు. మళ్లీ సిల్వియో సందేహపడ్డాడు. ఇలా కాల్చడం మర్డర్‌ చేయడం తప్ప మరొకటి కాదు. అందుకని మళ్లీ చీటీలు వేశారు. ఈసారీ జమీందారుకే తొలి ఛాన్స్‌ వచ్చింది. మహాచెడ్డ అదృష్టవంతుడు. జమీందారు కాల్చిన షాట్‌ మిస్‌ అయి ఆ పెయింటింగుకు తగిలింది. ఇప్పుడు కాల్చడం సిల్వియో వంతు. పిస్టల్‌ గురి పెట్టాడు. అప్పుడే దొరసాని ఆ గదిలోకి వచ్చింది. కాల్చవద్దని సిల్వియో కాళ్లదగ్గర పడింది. ‘మాషా, ఇది నీకు సిగ్గుగా లేదూ!’ అని జమీందారు వారించాడు.

అదిగో, అప్పుడు సిల్వియో వదిలేసి వెళ్లాడు. వెళ్తూ, గురి కూడా చూడకుండా జమీందారు కాల్చిన పెయింటింగును అదే స్థానంలో కాల్చాడు. తనకు అంతకుముందు తెలిసినదానికి జమీందారు చెప్పినదానితో కలిపి కథకుడు కథ పూర్తి చేస్తాడు. 

తర్వాత చాలా ఏళ్లకు అలెగ్జాండర్‌ ఇప్సిలాంటి నేతృత్వంలోని తిరుగుబాటులో సిల్వియో పాల్గొని స్కౌలానా యుద్ధంలో మరణించినట్టు కథకుడికి తెలుస్తుంది.


(సాక్షి సాహిత్యం; 2018 జూలై 23)

Thursday, May 21, 2026

బ్రేకింగ్‌ ద పిగ్‌


ఎట్గార్‌ కెరెట్‌

ఎట్గార్‌ కెరెట్‌ హీబ్రూ కథ ‘బ్రేకింగ్‌ ద పిగ్‌’ సారం ఇది. కెరెట్‌ 1967లో ఇజ్రాయిల్‌లో జన్మించారు. కథలూ, గ్రాఫిక్‌ నవలలూ, సినిమాలూ, టీవీకి స్క్రిప్టులూ రాస్తారు.


పందిపిల్ల బాధపడిన రోజు


నాన్న, బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ కొనడు. అమ్మ నిజానికి కొందామనే అంది. కానీ అలా కొనిస్తే చెడిపోతానట. ఎందుకు కొనాలసలు? వాడేదో ఏడుపు మొదలుపెట్టగానే నువ్వు ఠకీమని ఒప్పేసుకుంటావని అమ్మను కోప్పడ్డాడు కూడా. వాడికి డబ్బు విలువ తెలియట్లేదన్నాడు. చిన్నతనంలో కాక పొదుపు గురించి మరెప్పుడు నేర్చుకుంటాడన్నాడు. అడగ్గానే బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ అతిసులభంగా పొందిన పిల్లలు పెద్దయ్యాక మొద్దులుగా తయారవుతారని ఆయన ఉద్దేశం. ఇలాంటివాళ్లే ఏటీఎం మిషన్ల నుంచి డబ్బులు ఎత్తుకెళ్లే బాపతుగా తయారవుతారట. అందువల్ల బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ బదులుగా నాకు ఒక వికారమైన చైనా పంది బొమ్మ తెచ్చాడు. దాని వెనుక భాగంలో ఒక రంధ్రం ఉంది. ఇలా అయితే నేను మొద్దును కానన్నమాట!

ప్రతిరోజూ నేను కప్పు కోకో తాగాలి, అదంటే నాకు అసహ్యమైనప్పటికీ. తొక్కతో కోకో తాగితే ఒక షెకెల్‌(ఇజ్రాయిల్‌ నాణెం) ఇస్తారు. తొక్కలేనిదైతే అర షెకెల్‌. దాన్ని అట్లానే తీసి పారబోస్తే ఏమీ ఇవ్వరు! ఆ ఇచ్చిన నాణేల్ని పంది వెనకాలి రంధ్రంలో వేయాలి. ఆ బొమ్మను ఊపితే గలగలమని శబ్దం వస్తుంది. పంది ఎప్పుడైతే నిండుతుందో దాన్ని ఊపినప్పుడు గలగలమని శబ్దం రాదు. అప్పుడు స్కేట్‌బోర్డ్‌ మీద ఉన్న సింప్సన్‌ బొమ్మ కొంటాడు నాన్న. ఆ విధంగా నేను పొదుపు పాఠాలు నేర్చుకుంటున్నాను.

నిజానికి పంది బొమ్మ చూడముచ్చటగా ఉంది. దాని ముక్కును తాకితే చల్లగా ఉంటుంది. దాని వెనుక నాణేన్ని వేసినప్పుడల్లా అది నవ్వుతుంది. అర్ధనాణేన్ని వేసినా కూడా అలాగే నవ్వుతుంది. ఇంకో మంచి విషయమేమిటంటే, అసలు ఏ నాణేన్ని అందులో వేయకపోయినా కూడా అది అలాగే నవ్వుతుంది. నేను దానికి పెసాచ్సన్‌ అని పేరు పెట్టాను. ఈ పెసాచ్సన్‌ ఎవరంటే ఒకప్పుడు మేమున్న ఇంట్లో ఉండేవాడు. ఆయన పేరున్న లేబుల్‌ను మెయిల్‌ బాక్స్‌ మీదినుంచి ఎంత పీకేయడానికి నాన్న ప్రయత్నించినా సాధ్యం కాలేదు. పెసాచ్సన్‌ మిగతా బొమ్మల మాదిరిగా ఉండదు. ప్రశాంతంగా ఉంటుంది. దాన్లో లైట్లూ, స్ప్రింగులూ, లీకయ్యే బ్యాటరీలూ లేవు. అయితే, అది టేబుల్‌ మీద నుండి కిందకు దూకకుండా మాత్రం జాగ్రత్తగా చూసుకోవాలి. అది నేలవైపు వంగి కిందకు చూసినప్పుడు, ‘జాగ్రత్త పెసాచ్సన్‌! నువ్వు పింగాణీ తయారీవి’ అని చెబుతాను. అప్పుడు అది నా వైపు చూసి నవ్వుతుంది. నేను నా చేతిలోకి తీసుకునేంత వరకూ ఓపిగ్గా వేచి ఉంటుంది. పెసాచ్సన్‌ నన్ను చూసి నవ్వితే నేను వెర్రెత్తిపోతాను. కేవలం ఆ నవ్వు కోసమే నేను ప్రతి ఉదయం నాకిష్టం లేకపోయినా తొక్కతో ఉన్న కోకో తాగుతాను. దాని వెనకాల వున్న రంధ్రంలో నాణేన్ని వేసి దాని నవ్వు ఇంతకూడా ఎందుకు మారదో చూస్తాను. తర్వాత, ‘ఐ లవ్యూ పెసాచ్సన్‌’ అని చెబుతాను. ‘నిజంగా చెబుతున్నాను, అమ్మానాన్న కన్నా కూడా ఎక్కువగా నిన్ను ప్రేమిస్తున్నాను. నువ్వు ఏటీఎంలను పగలగొట్టినా సరే , ఎల్లప్పుడూ నిన్ను ఇలాగే ప్రేమిస్తాను. కానీ ఒకటి, టేబుల్‌ మీది నుంచి దూకాలని మాత్రం కనీసం ఆలోచన కూడా నీవు చేయొద్దు’.

నిన్న నాన్న వచ్చాడు. టేబుల్‌ మీదున్న పెసాచ్సన్‌ను పైకెత్తి కిందికీ మీదికీ గట్టిగా ఊపడం మొదలుపెట్టాడు. 

‘నాన్నా, జాగ్రత్త. నువ్వు పెసాచ్సన్‌కు కడుపునొప్పి తెప్పించేట్టున్నావు’ అన్నాను. కానీ నాన్న వినలేదు. ఇంకా అలాగే ఊపుతూ, ‘ఇందులోంచి శబ్దం రావడం లేదు. దీనర్థం నీకు తెలుసుకదా యోవి? నీకు రేపే స్కేట్‌బోర్డ్‌ మీదుండే సింప్సన్‌ బొమ్మ కొనిస్తాను’ చెప్పాడు నాన్న.

‘అద్భుతం నాన్నా. సింప్సన్‌ బొమ్మా? అద్భుతం. కానీ పెసాచ్సన్‌ను మాత్రం ఊపడం ఆపు. ప్లీజ్‌ దానికి నొప్పెడుతుంది’ అన్నాను. నాన్న పెసాచ్సన్‌ను తిరిగి టేబుల్‌ మీద పెట్టాడు. అమ్మ దగ్గరికి వెళ్లాడు. ఒక నిమిషం తర్వాత అమ్మను చేత్తో పట్టుకొని లాగినట్టుగా తోడ్కొని వచ్చాడు. ఇంకో చేతిలో సుత్తి వుంది. ‘చూశావా, నేనూహించినట్లుగానే జరిగింది’ చెప్పాడు నాన్న. ‘వస్తువుల విలువ ఏమిటో ఇప్పుడు వాడికి తెలుసు. కదా యువీ?’ ‘కచ్చితంగా తెలిసింది నాన్నా. అదిసరేగానీ సుత్తి ఎందుకు తెచ్చినట్టు?’ అని నేను అడిగాను. ‘నీ కోసమే’ అంటూ సుత్తిని నా చేతిలో పెట్టాడు. ‘జాగ్రత్త సుమా!’ అన్నాడు. ‘నేను జాగ్రత్తగానే ఉంటాను’ అన్నాను. నేను నిజంగానే జాగ్రత్తగా ఉన్నాను. కొన్ని నిమిషాలు వేచి చూశాక, నాన్న విసిగిపోయాడు. ‘కానివ్వురా, ఆ పందిని పగలగొట్టు’ అన్నాడు. ‘య్యేమిటీ?’ నేను అరిచాను, ‘పెసాచ్సన్‌ను పగలగొట్టాలా?’ ‘అవునవును, పెసాచ్సనే’ చెప్పాడు నాన్న, ‘కానీ, పగలగొట్టెయ్‌. నువ్వు చాలా కష్టపడ్డావు. బార్ట్‌ సింప్సన్‌ బొమ్మ కొనివ్వడానికి అర్హత సంపాదించావు’.

తన అంతిమ క్షణాలు వచ్చాయని తెలిసిపోయిన చైనా పందిలాగా పెసాచ్సన్‌ నావైపు చూసి దీనంగా నవ్వింది. సింప్సన్‌ బొమ్మ లేకపోతే పోయే! నేను నా ఫ్రెండు తల మీద సుత్తితో కొట్టడమా? ‘నాకు సింప్సన్‌ బొమ్మ వద్దు. ఈ పెసాచ్సన్‌ చాలు’ అని సుత్తిని నాన్నకు వెనక్కి ఇచ్చేశాను. ‘నీకు అర్థం కాలేదన్నమాట’ అన్నాడు నాన్న. ‘ఏం ఫర్లేదు. నన్ను చూసి నేర్చుకో. నీ కోసం నేనే పగలగొడతాను’. నాన్న అప్పటికే సుత్తిని పైకెత్తాడు. అమ్మ కళ్లు మూసుకుంది. పెసాచ్సన్‌ అలసిపోయినట్టుగా నవ్వుతున్నాడు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చేయాలి. నేను ఏమీ చేయలేదంటే పెసాచ్సన్‌ చచ్చిపోయినట్టే! ‘నా...న్నా...’ అని గట్టిగా నాన్న కాళ్లను పట్టుకున్నాను. ‘ఏం, యువీ?’ అడిగాడు నాన్న. చేతిలోని సుత్తి ఇంకా గాల్లోనే లేచివుంది. ‘నాన్నా! నాకింకో షెకెల్‌ కావాలి, ప్లీజ్‌. రేపు కోకో తాగిన తర్వాత అందులో వేయడానికి. రేపు దాన్ని నేనే పగలగొడతాను, తప్పకుండా’ అన్నాను. ‘ఇంకో షెకెలా?’ నాన్న నవ్వుతూ సుత్తిని టేబుల్‌ మీద పెట్టాడు, ‘చూశావా? వాడిలో ఎంత అవగాహన పెరిగేట్టు చేశానో’. ‘రేపు’. అప్పటికే నా గొంతు పూడుకుపోయింది.

అందరూ గదిలోంచి బయటికి వెళ్లిన తరువాత పెసాచ్సన్‌ను గట్టిగా హత్తుకున్నాను. ఒక్కసారిగా బయటికి ఏడ్చాను. పెసాచ్సన్‌ ఏమీ మాట్లాడలేదు. నా చేతుల్లో నిశ్శబ్దంగా వణికింది. ‘బాధ పడకు’ తన చెవిలో గుసగుసగా చెప్పాను, ‘నేను నిన్ను కాపాడుతాను’.

రాత్రి నాన్న ముందుగదిలో టీవీ చూడటం ముగించి, నిద్రకు ఉపక్రమించే వరకూ వేచివున్నాను. నెమ్మదిగా మంచం మీదినుంచి లేచి, పెసాచ్సన్‌ను పట్టుకుని బయటికి వచ్చాను. చాలాసేపు మేమిద్దరమూ చీకట్లో నడిచాం. చివరకు ముళ్లపొదలున్న ఒక పొలాన్ని చేరుకున్నాం. ‘పందులకు ముళ్లపొదలున్న పొలాలంటే చాలా ఇష్టం’ అని పెసాచ్సన్‌ను నేల మీద పెడుతూ చెప్పాను, ‘నీకు ఇక్కడ నచ్చుతుంది’. జవాబు కోసం ఎదురుచూశానుగానీ పెసాచ్సన్‌ ఏమీ అనలేదు. దానికి గుడ్‌బై చెప్పడానికి ముక్కు మీద తాకినప్పుడు మాత్రం విషాదంగా చూసింది. మరి నన్ను మళ్లీ ఎప్పటికీ చూడలేనని తనకు తెలుసుకదా!

(సాక్షి సాహిత్యం; 2018 మార్చ్‌ 19)




 

Monday, May 18, 2026

మై ఈడిపస్‌ క్లాంప్లెక్స్‌



ఫ్రాంక్‌ ఓ కానర్‌

 

ఫ్రాంక్‌ ఓ కానర్‌(1903–1966) ఐరిష్‌ కథ ‘మై ఈడిపస్‌ క్లాంప్లెక్స్‌’ సారాంశం ఇది. ఐర్లాండ్‌కు చెందిన ఓ కానర్‌ సుప్రసిద్ధ కథకుడు, కవి. ‘గెస్ట్స్‌ ఆఫ్‌ ద నేషన్‌’, ‘బోన్స్‌ ఆఫ్‌ కంటెన్షన్‌’, ‘క్రాబ్‌ ఆపిల్‌ జెల్లీ’, ‘ట్రావెలర్స్‌ శాంపిల్స్‌’ ఆయన కథాసంకలనాల్లో కొన్ని.


నాన్న నా శత్రువు


తండ్రి యుద్ధంలో ఉన్నాడు. పిల్లాడు ఎప్పుడోగానీ తండ్రిని చూడలేదు. బూట్ల చప్పుడు చేస్తూ వచ్చే ఖాకీ దుస్తుల శాల్తీలాగే ఆయన జ్ఞాపకం. శాంతా క్లాజ్‌లాగా ఇలా ఇంటికి వచ్చి అలా మాయమయ్యేవాడు.

ఆ వచ్చినప్పుడు ఆయన అమ్మను దగ్గరికి తీసుకోవడం వాడికి అసౌకర్యంగా ఉండేది. ఆయన పొగతాగేవాడు. అంతకుమించిన పనిలేదన్నంత శ్రద్ధగా గడ్డం గీసుకునేవాడు. ఆయన పోయినప్పుడు వదలిపోయిన కత్తులు, బుల్లెట్‌ కేసుల లాంటి మిలిటరీ సామగ్రి అంతా బీరువా మీది పొడువైన పెట్టెలో ఉంచేది అమ్మ. ఆయనకు ఏదైనా అందుబాటులో ఉండాలి.

పిల్లాడు తొలి కిరణాలు పడేవేళకు నిద్ర లేచేవాడు. మంచం మీంచి రెండు కాళ్లను కింద పెట్టేవాడు. మిసెస్‌ లెఫ్ట్, మిసెస్‌ రైట్‌ అని వాటికి పేర్లు పెట్టుకున్నాడు. అమ్మ, పిల్లాడు ఆ రోజు ఏమేం చేయాలో అవి చర్చిస్తాయి– ఇంటిని ఎలా అలంకరించాలి, క్రిస్‌మస్‌కు శాంతా క్లాజ్‌ ఏ ఇంట్లో ఏ బహుమతి ఇవ్వాలి లాంటివి. ఒక్కోసారి పాప సంగతి కూడా. అక్కడ కొత్త పాప లేని ఇల్లు వీళ్లదొక్కటే. పాపంటే మళ్లీ పదిహేడు షిల్లింగుల ఆరు పెన్నీల ఖర్చు అవుతుంది, నాన్న యుద్ధం నుంచి తిరిగొచ్చేవరకూ అంత ఖర్చు భరించలేము అంటుంది అమ్మ. కానీ రోడ్డు పై వైపు ఉండే జీనీ వాళ్ల ఇంట్లో ఒక పాప ఉంది. అందరికీ తెలుసు వాళ్ల దగ్గర కచ్చితంగా 17/6 లేవు. అది చవక పాప అయివుండాలి, అమ్మకు మంచి పాప కావాలేమో. జీనీ వాళ్లలాంటి పాప అయినాకూడా బానేవుంటుందిగా!

బ్రేక్‌ఫాస్ట్‌ అయిన తర్వాత అమ్మ, వాడు టౌనులోకి వెళ్లారు. సెయింట్‌ ఆగస్టీన్‌ చర్చిలో ప్రార్థన చేశారు. నాన్నను యుద్ధం నుంచి క్షేమంగా ఇంటికి పంపమని దేవుణ్ని కోరుకుంది అమ్మ. 

ఒక ఉదయాన నాన్న రానేవచ్చాడు. అమ్మ ముఖం వెలిగిపోయింది. అంత సంబరపడాల్సింది ఏముందందులో? దేవుడు మన ప్రార్థనలు విన్నాడంది అమ్మ. ఇంకా అన్యాయం ఏమిటంటే, నాన్న ఏదో ఒకటి అమ్మతో మాట్లాడుతూనేవున్నాడు. వీడు వాళ్ల మాటలకు అడ్డు తగిలాడు. ‘లారీ, ఒక్క నిమిషం’ అంది అమ్మ. అనాసక్తి కలిగించే చుట్టుపక్కలవాళ్లు ఎవరైనా వచ్చినప్పుడు ఆమె ఇలా అంటుంది. అందుకే దానికి అంత ప్రాధాన్యత ఇవ్వక మళ్లీ ఏదో మాట్లాడబోయాడు. ‘లారీ, నిశ్శబ్దంగా ఉండు. నేను నాన్నతో మాట్లాడుతున్నా, నీకు వినబడట్లేదా?’

ఇదే మొదటిసారి వాడు ఇలాంటి ‘అశుభకరమైన మాటలు’ వినడం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’. అయితే ఏమిటట! దేవుడు ఇలాగేనా ప్రార్థన విన్నది! అయితే ఆయన శ్రద్ధగా విన్నట్టు లేదు.

‘నాన్నతో ఎందుకు మాట్లాడుతున్నావు?’

‘నాన్నా నేనూ మాట్లాడాల్సిన విషయాలున్నాయి. మళ్లీ అడ్డుపడకు’.

మధ్యాహ్నం భార్య కోరిన మీదట వీడిని నడకకు తీసుకెళ్లాడు తండ్రి. నడక విషయంలో నాన్నకూ వాడికీ భేదాభిప్రాయాలున్నాయి. ట్రాములు, ఓడలు, గుర్రాలు ఇవేవీ ఆయనకు ఆసక్తి కలిగించవు. ఆయనంత వయసు వాళ్లు ఎదురైనప్పుడు మాత్రం మాట్లాడుతూ గోడకు చేరగిలబడతాడు. ఇక కదలడు. రెండోసారి అట్లా ఆగినప్పుడు పిల్లాడికి చిర్రెత్తుకొచ్చింది. కోటు, ప్యాంటు పట్టుకుని లాగాడు. కానీ నాన్నకు తిక్క రేగిందంటే, అమ్మలా కాదు, ‘లారీ, ఇలా విసిగించావనుకో, దెబ్బ పడుతుంది’ అన్నాడు. ఏడుపొచ్చినంత పనైంది. కానీ ఏడ్చినా ఆయన పట్టించుకుంటాడన్న నమ్మకం కలగలేదు. ఒక కొండరాయితో వాకింగ్‌ చేస్తున్నట్టే ఉంది.

ఇక సాయంత్రం టీ సమయంలో మళ్లీ ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కార్యక్రమం మొదలవుతుంది. ఈవ్‌నింగ్‌ పేపర్‌ దాన్ని మరింత సంక్లిష్టం చేస్తుంది. పేపర్‌లో నాన్న కాసేపు తల పెడతాడు. దాన్ని కిందపెట్టి అందులోంచి ఏదో కొత్త విషయం అమ్మకు చెబుతాడు. ఇది కచ్చితంగా నాటకం. అమ్మ తలను తిప్పించుకోవడంలో వాడు నాన్నతో పోటీ పడగలడు. కానీ ఈ పేపర్‌వాళ్లు అందరూ ఆయనకు సహకరిస్తుంటే ఇంకేం చేయగలడు! అయినా విఫలయత్నం చేశాడు. ‘నాన్న పేపర్‌ చదువుతున్నప్పుడు నువ్వు నిశ్శబ్దంగా ఉండాలి’ అంది అమ్మ అసహనంగా.

నిజంగానే అమ్మకు నాకన్నా కూడా ఆయనతో మాట్లాడటం ఎక్కువ ఇష్టం ఉండాలి, లేదా  నిజాన్ని ఒప్పుకోవడానికి భయం అయినా కావాలని తలపోశాడు వాడు. ఆ రాత్రి అడిగాడు. ‘అమ్మా, నేను దేవుణ్ని ప్రార్థిస్తే నాన్నను మళ్లీ యుద్ధానికి పంపుతాడా?’

‘పంపుతాడనుకోను’ నవ్వుతూ చెప్పింది అమ్మ.

‘ఎందుకమ్మా?’

‘ఎందుకంటే యుద్ధం లేదు కాబట్టి.’

‘కానీ ఆయన తలుచుకుంటే ఇంకో యుద్ధం సృష్టించలేడా?’

‘ఆయనకు ఇష్టం ఉండదు. అయినా యుద్ధాన్ని దేవుడు తేడు నాన్నా, చెడ్డ మనుషులు తెస్తారు’.

తెల్లారి వాడు నిద్ర లేచి, పెద్ద మంచం మీదికి వెళ్లాడు. అమ్మ పక్కలో ఖాళీ లేదు. మధ్యలో దూరాడు. నాన్న తన మంచం కన్నా ఎక్కువ ఆక్రమించుకున్నాడు. అందుకని వీడు కాళ్లతో తన్నాడు. నాన్న అటు జరిగి పడుకున్నాడు. వీడు నోట్లో వేలు వేసుకుని సౌకర్యంగా, ‘అమ్మా’ అని పిలవబోయాడు. ‘ష్, నాన్నను నిద్ర లేపకు’ గుసగుసగా చెప్పింది అమ్మ. ఇది కొత్త పరిణామం. ‘నాన్నతో మాట్లాడుతున్నా’ కన్నా ఇది మరింత ప్రమాదకరంగా కనబడింది.

‘ఎందుకు?’

‘పాపం నాన్న ఆలసిపోయాడు’

పాపం నాన్న. ఈ మాట అసలు నచ్చలేదు వాడికి. ఈ రోజు చేయాల్సిన ఎన్నో ఆలోచనలతో వచ్చాడు. ‘కొత్త వలతో చేపలు పట్టడానికి వెళ్లాలి’...

అమ్మ మాట్లాడకుమని చెబుతూనేవుంది. నాన్నకు మెలకువ వచ్చింది. అమ్మ చిత్రమైన గొంతుతో ‘టీ తాగుతారా?’ అంది. పిల్లాడు ఇంకేదో చెప్పబోయాడు. ‘నువ్వు పడుకో’ అంది అమ్మ.

ఇక లాభం లేదు. అమ్మకు తాను దూరమవుతున్నాడు. ఇంతకుముందు తనకు విడి మంచం వేసినప్పడు, ఒక్క మంచం మీద పడుకునేదానికి వేరేది ఎందుకని అడిగితేనేమో, అది ఆరోగ్యకరం అని చెప్పింది. అలాంటిది ఈ కొత్త మనిషి వచ్చి అమ్మ ఆరోగ్యం పట్ల ఏ పట్టింపు లేకుండా ఇక్కడే పడుకుంటున్నాడు. కానీ అమ్మేమో అదో విషయంగా పట్టించుకోకపోగా, తననే మాట్లాడొద్దని చెబుతోంది. ఏమంటే, పాపం నాన్న ఆలసిపోయాడు. ఏమంటే, ఆయన బయటికి వెళ్లి డబ్బులు సంపాదించాలి. ఏమంటే, అలా సంపాదించకపోతే మనకు తినడానికి ఏమీవుండదు. అలా ఏమీలేకపోతే అడుక్కుతినాలి.

కానీ ఇదేం బాగోలేదు. తన ప్రాధాన్యత తగ్గిపోయింది. అమ్మతో తన ఉషోదయపు చర్చలు ఆగిపోయినై. ఈ అన్యాయాన్ని సహించడానికి వీలు లేదు. మంచంలో అటూయిటూ కదిలాడు. కాళ్లూ చేతులూ గట్టిగా విదిలించాడు. నాన్న నిద్ర లేవనే లేచాడు. ‘ఈ పిల్ల రాకాసి నిద్రే పోడా?’ అన్నాడాయన లేస్తూ. ‘అది వాడికి అలవాటు... చూశావా లారీ, నువ్వు నాన్నను లేపావు, వెళ్లు నీ మంచం మీదికి’ అరిచింది అమ్మ. ‘అయితే ఆ అలవాటును వదిలించాలి’ అన్నాడాయన.

‘నోర్మూసుకో’ అన్నాడు వీడు.

ఒక్క ఉదుటున మంచం మీంచి లేస్తూ, ‘ఏమన్నావురా పిల్లకాకి’ అన్నాడాయన.

‘మిక్‌ మిక్‌’ సముదాయించింది భార్య. ‘వాడికి నువ్వింకా అలవాటు కాలేదు’.

‘దెబ్బ పడితేగానీ అర్థం కాదు, చెడ్డీ పగలాలి’ అన్నాడాయన.

‘నువ్వే కొట్టుకో’

ఆయన సహనం కోల్పోయి ఒక దెబ్బ వేశాడు. అదేమీ గట్టిగా కొట్టిన దెబ్బ కాదు, అలా వేశాడంతే. కానీ వాడి గౌరవం మంట గలిసింది. ఆ క్షణం నుంచీ తండ్రీ కొడుకులిద్దరూ శత్రువులుగా మిగిలిపోయారు. 

తల్లీతండ్రీ మాట్లాడుకుంటున్నప్పుడు వీడు తన బొమ్మలతో ఆడుకునేవాడు, వాళ్లను పట్టించుకోనట్టుగా. వాడికి అర్థం కానిదేమిటంటే, అమ్మను ఆయనవైపు అంత ఆకర్షితురాలిని చేస్తున్న అంశం ఏమిటి? మొత్తం అంతా ఆ న్యూస్‌పేపర్లోనే ఉందా? అందుకని వాడు కూడా కూడబలుక్కుని అమ్మకు చదివి వినిపించడానికి ప్రయత్నించేవాడు. చివరికి ఒకరోజు అన్నాడు, ‘అమ్మ, నేను పెద్దయ్యాక ఏం చేస్తానో తెలుసా? నిన్ను పెళ్లి చేసుకుంటా’. ఆమె నవ్వింది. తండ్రి ఓసారి తల తిప్పి చూశాడుగానీ పట్టించుకోలేదు. అది నటన అనుకున్నాడు వాడు. ‘మనకు చాలామంది పాపలు వస్తారు’ అని కొనసాగించాడు.

‘అది సరేగానీ ముందైతే మనకో పాప వస్తుంది. నీతో ఆడుకుంటుంది’ చెప్పింది అమ్మ.

ఇక ఆమె పూర్తిగా ఇంటిపట్టునే ఉండటం మొదలైంది. వాడిని నడకకు తీసుకెళ్లడం మానేసింది.  తండ్రి ఎక్కడ 17/6 సంపాదిస్తున్నాడో. సాయంత్రాలు ఇంట్లో కనబడేవాడు కాదు.

ఎట్టకేలకు ఇంట్లోకి సానీ వచ్చాడు. వీడింకా ఘోరం. ఎప్పుడూ ఏడుస్తాడు. ఎప్పుడూ పడుకునే వుంటాడు. అమ్మ వెన్నంటే ఉండాలి. వాడు నిద్రలేవకూడదంటే మునిగాళ్ల మీద నడవాలి. వాణ్ని ఊయల ఊపాలి. ‘పాపం నాన్నను నిద్ర లేపొద్దు’ అనేది పోయి, ‘సానీని లేపొద్దు’ అనేది ఇంట్లో మాటైపోయింది. 

ఒకరోజు లారీ పక్కన ఎవరో పడుకున్నట్టు అనిపించింది. ముందు అమ్మ అనుకున్నాడు, కానీ నాన్న. అమ్మ మొత్తం శ్రద్ధ ఇప్పుడు సానీ మీదే. వాడు ఏడుస్తుంటే ఊరడిస్తోంది. అందుకే నాన్న ఇటు వచ్చాడు. తండ్రి మీద వాడికి జాలేసింది. ఇది వాడికి అనుభవమే కదా! తండ్రిని ఓదార్చుతున్నట్టుగా ఆయన చేతిని తన మీద వేసుకున్నాడు.

(సాక్షి సాహిత్యం; 2018 జూన్‌ 4)